ఒక పజిల్‌ను పరిష్కరించడం వస్తువులు: కాగితం లేక అట్టముక్క, డ్రాయింగ్ పాత్రలు మరియు కత్తెర. దశలు: కాగితం ముక్క లేదా ఒక అట్టముక్క మీద ఒక మనిషి బొమ్మ గీయండి. బొమ్మ గీసిన కాగితాన్ని మూడు ముక్కలుగా కత్తిరించండి. పై భాగము (తల), మధ్య భాగము (శరీరం) మరియు దిగువభాగం (కాళ్లు). పై భాగము 'తల', మధ్యభాగం 'శరీరం', దిగువన 'కాళ్లు' ఉన్నాయని బిడ్డకు బొమ్మను చూపిస్తూ వివరించండి. ముక్కలను వేరుచేసి, ఆ భాగాలను తిరిగి కలిపి, మనిషి బొమ్మ చేయమని బిడ్డకు చెప్పండి. బిడ్డ మనిషి శరీర భాగాలను సరిగా అమర్చినప్పుడు అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. సూక్ష్మ కండరాల చలన అభివృద్ధితో పాటు శరీర భాగాలపై బిడ్డకు అవగాహన కలుగుతుంది. కలిసి బట్టలు మడత పెట్టడం వస్తువులు: శుభ్రమైన దుస్తులు. దశలు: మడత పెట్టడానికి శుభ్రమైన దుస్తులను సేకరించండి. బిడ్డతో పాటు కూర్చుని బట్టలు ఎలా మడత పెట్టాలో చూపించండి. ఏదో ఒక వస్తువు తీసుకుని మడత పెట్టడంలో బిడ్డ మిమ్మల్ని అనుకరించేలా ప్రోత్సహించండి. బట్టలు మడత పెట్టే పనిలో మీకు సహాయం చేయటానికి, బిడ్డ చేస్తున్న ప్రయత్నాలను అభినందించండి. బట్టల రంగులు మరియు దుస్తుల రకాల గురించి బిడ్డతో మాట్లాడుతూ దీనిని ఆహ్లాదకరమైన, పరస్పర చర్యగా మార్చండి. కృత్యం ప్రాధాన్యత: మడత పెట్టడం వలన సూక్ష్మ కండరాల చలన అభివృద్ధి మెరుగుపడుతుంది. రోజువారీ పనులలో కుటుంబ సభ్యుల సహకారము మరియు బంధాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక మాంత్రిక గుడారం వస్తువులు: రెండు దృఢమైన కుర్చీలు, ఒక దుప్పటి, బెడ్ షీట్ లేదా కండువా. దశలు: రెండు దృఢమైన కుర్చీలను ఒక దుప్పటి లేదా కండువాతో కప్పి ఒక గుడారం తయారు చేయండి. ఈ ప్రత్యేకమైన ఇంటి లోపలికి బిడ్డను ఆహ్వానించి ఆటకు సౌకర్యవంతమైన స్థలంగా ఆ ప్రదేశాన్ని మార్చండి. ఊహాత్మక ఆటకు కావలసిన ఆట బొమ్మలను గుడారం లోనికి బిడ్డ తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించండి. ఈ ప్రత్యేక ప్రదేశానికి ఇద్దరూ కలిసి ఆహ్లాదకరమైన మరియు సృజనాత్మకమైన పేరును పెట్టండి. ఈ గుడారం లోపల ఆడుకునే ఇతర ఆటలు, కథలు మరియు కృత్యాలు బిడ్డతో కలిపి ఆలోచించండి. కృత్యం ప్రాధాన్యత: ఊహాత్మక ఆటలను మరియు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. కొత్త ఆటలు సృష్టించడానికి ఈ మాంత్రిక గుడారం ఒక అనువైన ప్రదేశము. పని వద్ద ఏమి జరుగుతుంది? వస్తువులు: ఏమీ లేవు. దశలు: పనిలో ఉన్నప్పుడు తల్లి లేదా తండ్రి ఏమిచేస్తారో బిడ్డతో చెప్పండి. పనులను వివరించడానికి సరళమైన భాషను ఉపయోగించండి. ఉదా: వ్యవసాయం.విత్తనాలు నాటడం, మొక్కలకు నీళ్లు పెట్టడం మరియు కలుపు తీయడం వంటి కృత్యాల గురించి మాట్లాడండి. ప్రశ్నలు అడగడానికి లేదా కొన్ని పనులను అనుకరించడానికి బిడ్డను ప్రోత్సహించండి. హావభావాలను, ఉత్సాహాన్ని చూపించి బిడ్డ మరింత నిమగ్నం అయ్యేలా చేయండి. కృత్యం ప్రాధాన్యత: కథ చెప్పడం వల్ల భాషాభివృద్ధి మెరుగుపడుతుంది. బిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం వల్ల ఉత్సుకత మరియు ఊహాత్మక ఆటలు ఆడటానికి దోహదపడుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ