పరిచయం ఖనిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను, కణాల మరియు కణజాల సంరక్షణకు, ఇంకా మన ఆరోగ్యానికి దోహదం చేసే ఇతర కార్యకలాపాలను పరిరక్షించే సూక్ష్మపోషకాలు. ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. స్థూల ఖనిజలవణాలు అంటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరంలో 0.05% ఉంటాయి. సూక్ష్మఖనిజలవణాలు మన శరీరంలో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజలవణాలను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. వీటినే "ట్రేస్ ఎలిమెంట్స్" అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్ మరియు మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. ఐరన్ (ఇనుము) సాధారణంగా మానవుని శరీరంలో మొత్తం ఐరన్ 4-5 గ్రా.ల పరిమాణంలో ఉంటుంది. ఐరన్ అనేది మానవుని శరీరంలో హీమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. శరీరంలో ఐరన్ సంక్లిష్ట రూపంలో ప్రోటీన్ కు పార్ఫరిన్ లేదా ఫెర్రిటిన్ లేదా ట్రాన్స్ ఫెరిన్ రూపంలో అతుక్కొని ఉంటుంది. విధులు 1. ఆక్సిజన్ రవాణా చేయడం, భద్రపరచుట ప్రతి గ్రాము హీమోగ్లోబిన్ 3.34 మి.గ్రా. ఐరన్ ను కలిగి ఉంటుంది.మయోగ్లోబిన్ కండరాలలో ఉంటుంది.అక్కడ ఇది ఆక్సిజన్ రిజర్వాయర్ గా పనిచేస్తుంది.ఆక్సిజన్ ఆహారపు అణువులతో కలిసి కండరాల సంకోచానికి కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. 2. ఎంజైము కో-ఫాక్టర్ మరియు ఇతర మాంసకృత్తులుఐరన్ ను కలిగి ఉన్న హీం సముదాయం కూడా ఇతర మాంసకృత్తుల భాగం, పోషకాల ఆక్సీకరణకు శక్తిని విడుదల చేయడంలోను మరియు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లోని శక్తిని బంధించడంలో పాల్గొంటుంది.కణాలు సక్రమంగా పనిచేయడానికి, ఐరన్ హీం రహిత ఎంజైములకు కో-ఫాక్టర్ లాగా పనిచేస్తుంది. కాపర్ తో పాటు ఐరన్ ఖనిజ కో-ఫాక్టర్ గా సైటోక్రోం ఆక్సీడేజ్ కు పనిచేస్తుంది. 3. ఎర్రరక్తకణాల తయారీఎముక మూలుగ పరిణతి చెందని కణాలను ఉత్పత్తి చేస్తుంది.వాటిని "ఎరిత్రోబ్లాస్ట్" అంటారు.ఎరిత్రోబ్లాస్ట్ లు ఎముక మూలుగలో పరిణతి చెందిన కొద్ది ఐరన్ ను కలిగిన హీం సముదాయం, విటమిన్ –B6 మరియు కాపర్ సహాయం తీసుకుంటుంది.హీం సముదాయం గ్లోబిన్ అణువులకు అతుక్కొని హీమోగ్లోబిన్ అణువులుగా ఎరిత్రోబ్లాస్ట్ ల ద్వారా సంశ్లేషించబడుతుంది. ఎర్రరక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఎర్రరక్తకణాలు చనిపోయినపుడు అవి రక్తం నుండి కాలేయ కణాలు, ఎముక మూలుగ మరియు ప్లీహం ద్వారా తొలగించబడతాయి. ఐరన్ లభించే పదార్థాలు ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు ఆకుకూరలు ఐరన్ లభించే ముఖ్య పదార్థాలు.ఐరన్ అనేది శాఖాహారం కంటే మాంసాహారం నుండి ఎక్కువగా ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో 50 గ్రాం.ల ఆకుకూరలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన ఐరన్ అవసరాలను అందుకోవచ్చు. మాంసాహారం 100 గ్రాములలో ఉండే పరిమాణం (మిల్లి గ్రాములలో) పీతలు 21 రిబ్బన్ చేప 14 హెర్రింగ్ చేప 9 గొర్రె కాలేయం 6 రొయ్యలు 5 బోటి 3 పంది మాంసం 2 కోడి గ్రుడ్డు 2 శాఖాహారం మి.గ్రా./100 గ్రాం కాలీఫ్లవర్ 40 కామంచి 21 అటుకులు 20 బీట్ రూట్ 16 పుదీనా 16 సోయాచిక్కుడు 10 పప్పుకూర 15 చామదుంప ఆకు 10 శనగ పప్పు 10 నువ్వులు 9 బొబ్బర్లు 9 సజ్జలు 8 ఉల్లికాడ 7 ఎండు ఖర్జూర 7 మరమరాలు 7 ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది శరీరంలో ఐరన్ లోపం ఉంటే హీమోగ్లోబిన్ ఏర్పడదు. అందువల్ల ఎర్రరక్తకణాలు చిన్నవిగా పాలిపోతాయి. అందువల్ల వచ్చే అనీమియాను లేదా రక్తహీనతను "హైపోక్రోమిక్ మరియు మైక్రోసైటిక్ అనీమియా" అంటాము. ఈ రకమైన అనీమియా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎక్కువగా ఆడవారిలో, పిల్లలలో కనిపిస్తుంది. ఈ అనీమియా ఐరన్ ఉన్న ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం లేదా శరీరంలో సరిగ్గా గ్రహించకపోవడం లేదా రక్తస్రావం వలన శరీరంలోని ఐరన్ ఉపయోగించుకోలేక పోవడం వలన వస్తుంది. ఒక డె.లీ. రక్తంలో ఉండవలసిన హీమోగ్లోబిన్ నవజాత శిశువులలో: 17 - 22 గ్రాములు పిల్లలలో: 11 - 13 గ్రాములు పురుషులలో: 14 - 18 గ్రాములు స్త్రీలలో: 12 - 16 గ్రాములు పైన చెప్పిన దాని కంటే రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువుంటే రక్తహీనత అంటాము రక్తహీనత లక్షణాలు నీరసం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, కళ్ళు తిరగడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, గోర్లు వంకర్లు పోవడం, మాట తడబడడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, చర్మం పాలిపోవడం, ఏ పని చేయలేకపోవడం తీవ్ర అనీమియా గా ఎప్పుడు అంటామంటే హీమోగ్లోబిన్ 7.5 g/dl కంటే తగ్గినపుడు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. కారణాలు అధిక రక్తస్రావం క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధులున్నపుడు, అతిగా రక్తదానం చేయడం, హుక్ వార్మ్ ఇంఫెక్షన్ రావడం, ఆహారంలో ఐరన్ లోపించడం, గర్భిణులకు, బాలింతలకు ఐరన్ ని అందించలేకపోవడం, అతిసారం, జీర్ణాశయంలో ఆంలాల స్రవణ సరిగ్గా లేనప్పుడు ఐరన్ శోషణ సరిగ్గా జరగదు.అప్పుడు కూడా అనీమియా వస్తుంది. అనీమియా వల్ల తల్లి, బిడ్డలిద్దరి ఆరోగ్యానికి ముప్పు ఉంది. సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అనగా ఉప్పు.మనం ప్రకృతిలో లభించిన రూపంలో తీసుకునే ఏకైక ఖనిజ లవణం.ఇది చర్మం క్రింది కణజాలల్లో నిల్వ ఉంటుంది. ఇది చెమట మరియు మూత్రం ద్వారా శరీరం నుండి బయటికి వెళ్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన వారిలో 2-10 గ్రాముల సోడియం క్లోరైడ్ విసర్జింపబడుతుంది. వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా శ్రమించినప్పుడు కండరాల సంకోచం నొప్పిగా మారి ఒంట్లో వేడి సెగలు కల్గుతున్న సమస్యను చూడవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.మన ఆహారంలో మాంసకృత్తులు లోపించినప్పుడు ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు చేరి మనిషి ఉబ్బిపోతాడు. దీన్ని ఎడిమా అంటాము. దీనివల్ల ఆ వ్యక్తి రక్తపోటు ఎక్కువైపోతుంది. దీన్ని మనం ఎక్కువ అధిక రక్తపోటు సమస్య ఉన్నవారిలో చూడవచ్చు. మనం ఆహారలో ఎంత ఉప్పు తీసుకోవాలో ఈ క్రింది వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనం నివసించే వాతావరణంను బట్టి, మనం చేసే పనిని బట్టి, ఆహారంలో ఉప్పు ను బట్టి. సిఫారసు చేయబడ్డ మోతాదు పని వర్గం ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) తక్కువ పని చేసేవారు 10 ఎక్కువ పని చేసేవారు 15 చాలా ఎక్కువ శ్రమించేవారు 20 పిల్లలు 5-10 కౌమారులు 10-20 గర్భిణులు 5-10 పాలిచ్చే తల్లులు 15 మనం ఉప్పును ఎక్కువగా శాకాహారం కంటే మాంసాహారంలో అధికంగా చూడవచ్చు. సోడియం ఎక్కువగా ఆలుగడ్డలు, టమాటాలు, బేకరి పదార్థాలు, పాలకూర, ద్రాక్ష, పంపర పనస, పచ్చళ్ళు, ఉప్పు ప్రిజర్వేటివ్ కల్పిన జ్యూస్ లలో ఉంటుంది. జింక్ మానవ శరీరంలో సుమారు 1.4-2.3 గ్రాం.ల జింక్ ఉంటుంది. ఇది చర్మంలో, ఎముకలలో, ప్రోస్టేట్ గ్రంథిలో ఉంటుంది. అంతే గాక కార్బోనిక్ అన్ హైడ్రస్ అనే ఎంజైములో మరియు ఎర్ర రక్తకణాలలోను ఉంటుంది. ఉపయోగాలు జింక్ జీవక్రియలకు తోడ్పడే మెటాలో పెప్టైడ్స్, ఫాస్ఫడేజ్, డీహైడ్రోజినేజ్ మరియు ట్రాన్స్ అమైనేజ్ సక్రమంగా పనిచేయుటకు చాలా అవసరం. డి.ఎన్.ఎ.పాలిమరేజ్ అనే ఎంజైము యొక్క స్రవణకు ఇది అవసరం. జింక్ కణాలు ఏర్పడ్డానికి, వాటి ఎదుగుదలకు, సంపర్కణకు మరియు రోగాలను ఎదుర్కొనే శక్తికి చాలా అవసరం. మనకు ఆకలి సరిగ్గ ఉండాలన్నా, పదార్థాల యొక్క రుచి తెలియాలన్నా, చీకటిలో దృష్టి సరిగ్గా ఉండాలన్నా జింక్ తప్పనిసరి. హార్మోన్ల పని సక్రమంగా ఉండాలన్నా కూడా జింక్ మన ఆహారంలో సమపాళ్ళలో ఉండాలి. సుమారు 200 లకు పైగా ఎంజైములు జింక్ మీద ఆధారపడి ఉన్నాయి. జింక్ కి మన కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించే శక్తి ఉంది.అందువల్ల దీనిని "ఆంటీ ఆక్సిడెంట్" గా వర్ణించవచ్చు. వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. కణ పొరలలో లిపిడ్స్ సమతుల్యాన్ని జింక్ పర్యవేక్షిస్తుంది. జన్యు పదార్థాలు ఏర్పడ్డానికి కావలసిన మాంసకృత్తుల జీవక్రియలలో జింక్ ఆధారిత ఎంజైములు పాల్గొంటాయి. కొలెస్ట్రాల్ రవాణాకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు సాధారణంగా జింక్ లోపం మన ఆహారంలో ఫైటేట్స్ మరియు ఫాస్ఫేట్ అధికంగా ఉన్నప్పుడు వస్తుంది. మన ఆహారంలో కాపర్ అధికంగా ఉన్నా పోషకాల శోషణ సరిగా లేకున్నా సిక్కిల్ రక్తహీనత ఉన్నా, శస్త్రచికిత్స జరిగినా, గాయాల కారణంగా రక్తం ఎక్కువగా నష్టపోయినా జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. కొందరిలో జింక్ శోషణ సరిగా లేకపోవడం ఒక జన్యుపరమైన సమస్య. జింక్ గర్భంలో ఉన్న బిడ్డ అవయవాలు ఏర్పడ్డానికి చాలా అవసరం.ఒకవేళ ఇది గర్భిణిలో సమతుల్యంగా లేకుంటే బిడ్డకు అవయవ లోపం వచ్చే అవకాశం ఉంది.అంతేగాక అలా పుట్టిన పిల్లల్లో గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. జింక్ పెరుగుదల హార్మోన్ల పనితీరును పర్యవేక్షిస్తుంది. 1-2 సం.పిల్లల్లో మెదడు యొక్క కణాల ఏర్పాటుకు జింక్ అత్యంత ఆవశ్యకం.ఒకవేళ ఆ సమయంలో జింక్ లోపం ఉంటే మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండదు. జింక్ ఆధారిత ఎంజైము అయిన "రెటినాల్ రిడక్టెస్"గా మార్చి చీకటి దృశ్యాలను చూడడానికి కారణం అవుతుంది.అందువల్లనే పోషకాహార లొపం, పోష్టికాహార లోపం అధికంగా ఉన్న పిల్లల్లో ప్రోటీన్ శక్తి లోపంతో పాటు జింక్ లోపం కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ ఇదే జింక్ సాధారణ స్థాయి కన్నా అధికంగా ఉంటే విషపూరితమే. దానివల్ల నోరు ఒక రకమైన ఖనిజ రుచికి గురికావడం జరుగుతుంది. ఉబ్బరం, కడుపులో నొప్పి, రక్త విరేచనాలకు గురవుతారు. అత్యధికంగా అంటే రోజుకు 18.5 మి.గ్రా.ల జింక్ మనం తీసుకున్నట్లైతే మన శరీరంలో కాపర్ యొక్క శోషణ మందగిస్తుంది.అందువల్ల కాపర్ లోపం ఏర్పడి మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. సిఫారసు చేయబడ్డ మోతాదు వర్గం ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) పురుషులు 12 స్త్రీలు 10 గర్భిణులు 12 పాలిచ్చే తల్లులు 12 పిల్లలు 1-3 సం. 5 4-6 సం. 7 7-9 సం. 8 బాలురు 10-12 సం. 9 13-15 సం. 11 16-17 సం. 12 బాలికలు 10-12 సం. 9 13-15 సం. 11 16-17 సం. 12 జింకు లభించే ఆహారపదార్థాలు ఆహార పదార్థాలు 100 గ్రాములకు లభించే పరిమాణం(గ్రాములలో) హెర్రింగ్ చేప, ముత్యపు చిప్ప 70-150 తృణధాన్యాలు, చిరుధాన్యాలు 2-6 పప్పుదినుసులు, నూనెగింజలు 3-6 కాలేయం, మాంసం, చేప గుడ్డు 3-10 కాపర్ ఆరోగ్యవంతమైన మానవ శరీరం 100-150 మి.గ్రా.ల కాపర్ ను కలిగి ఉంటుంది. విధులు రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి కాపర్ ఎంతగానో సహాయపడుతుంది. ఎంజైముల జీవక్రియలో కూడా ఉపయోగపడుతుంది. ఎర్రరక్తకణాలు ఏర్పడ్డానికి, ఎముకలు బలంగా ఉండడానికి, కణజాలాల అభివృద్ధికి, మయలిన్ ఏర్పడ్డానికి, మెలనిన్ వర్ణద్రవ్యం ఏర్పడ్డానికి, ఆక్సీకరణ, ఫాస్ఫారిలేషన్ మొదలైన వాటికి కాపర్ అవసరం. టైరోసినేస్ - మెలనిన్ ఏర్పాటు సైటోక్రోం ఆక్సిడేజ్ - మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే జీవక్రియకు తోడ్పడుతుంది. లైసిల్ ఆక్సిడేజ్ - కణజాలాలలో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ బంధాలను ఏర్పరుస్తుంది. సూపరాక్సైడ్ డైమ్యుటేజ్ - ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. కాపర్ లోపం వల్ల వచ్చే అనర్థాలు కాపర్ లోపం మానవులలో చాలా తక్కువగా కనిపించినప్పటికి, దీని లోపం వలన పిల్లల్లో బుద్ధిమాంద్యత, హైపోటోనియా (రక్త ద్రవవిసరణ పీడనం), హైపొపిగ్మెంటేషన్, శ్లేష్మపొర, రక్తహీనత, బోలు ఎముకలు ఏర్పడంవంటివి చోటుచేసుకుంటాయి. మెంక్సీ కీంకీ హేర్ సిండ్రోం ఒక జన్యుపరమైన సమస్య. ఇందులో రక్త సీరంలో కాపర్ మరియు సెల్యులో ప్లాస్మిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల పెరుగుదల మందగింపు, మెదడు కణజాలాలు చెడిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడం, మూర్చవ్యాధి, ధమని గోడలు దెబ్బతినడం, చర్మం మరియు జుట్టు వర్ణంలో మార్పు రావడం, జుట్టు నాణ్యతను కోల్పోయి తెల్లగా మారటం జరుగుతుంది. మన శరీరంలో కాపర్ శోషణ సరిగా లేకపోయినా, కాపర్ రవాణా జరగకపోయినా, కాపర్ అతిగా విసర్జింపబడిన ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కాపర్ ఎక్కువగా ఉన్నట్లైతే కొన్ని విష పరిణామాలను చూడవచ్చు. లాలాజలం అధికంగా ఉత్పత్తి అవడం, ఉదరంలో నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు కలుగుతాయి. కాలేయంలో కాపర్ నిల్వలు చాలా ఎక్కువ అయినపుడు కాలేయం పనిచేయడం ఆగిపోతుంది. విల్నన్ వ్యాధి ఈ వ్యాధి ఒక జన్యుపరమైన సమస్య.ఈ వ్యాధి వచ్చిన వారిలో బైల్ లో ఉండే కాపర్ విసర్జింపకపోవడం వల్ల అది కాలేయంలో, మెదడులో, మూత్రపిండాలలో, కంటి శుక్లములో పేరుకుపోతుంది.అప్పుడు పచ్చని, నశం రంగులో వలయాలు ఏర్పడతాయి. సాధారణ మానవుడు రోజుకు 2.2 మి.గ్రా. కాపర్ తీసుకోవాలి. అన్నం మరియు గోధుమల మీద ఆధారపడి ఉండేవారు రోజుకు 4-6 మి.గ్రా. కాపర్ ను తీసుకోవాలి. కాపర్ లభించే ఆహార పదార్థాలు ఫ్రతి వంద గ్రాముల ఆల్చిప్పలు, ఎండ్రికాయలు, మేకమాంసం, నూనెగింజలు, బాదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, సోయాలలో 12-37 మి.గ్రా. కాపర్ లభిస్తుంది. పండ్లు మరియు కూరగాయలలో కాపర్ శాతం తక్కువగా ఉంటుంది. తృణ మరియు చిరుధాన్యాలలో పొట్టులో ఎక్కువగా ఉంటుంది. పొట్టు తీసేసిన పిండిలో కాపర్ అసలుండదు. ఫ్లోరిన్ ఫ్లోరిన్ పృకృతిలో ఫ్లోరైడ్ రూపంలో ఉంటుంది. ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మట్టిలో, నీళ్ళలో, చెట్లలో, జంతువులలో ఉంటుంది. మానవ శరీరంలో ఎముకలలో,దంతాలలో, చర్మంలో, థైరాయిడ్ గ్రంథిలో ఇది ముఖ్య ఖనిజం. ఉపయోగాలు మన దంతాలలో ఉండే ఫ్లోరిన్ వాటిని పుచ్చిపోకుండా రక్షిస్తుంది. ఎముకలకు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. ఫ్లోరిన్ పెద్దవారిలో దంత సమస్యలను మరియు ఎముకలు విరగడాన్ని నివారిస్తుంది. నీటిలో 1 PPM (parts per milliong- 1/1000000)కంటే తక్కువ ఫ్లోరిన్ ఉన్నట్లైతే దంత సమస్యలు దరిచేరవు. ఎందుకంటే ఇది నోటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను అంతమొందిస్తుంది. దీని సాధారణ స్థాయి 1-2 PPM గా ఉండాలి. కాని 3-5 PPM ఉంటే దంతాల ఫ్లోరోసిస్, 10 PPM అంతకంటే ఎక్కువ ఉంటే ఎముకల ఫ్లోరోసిస్ వస్తుంది. నీటి ద్వారానే ఫ్లోరిన్ శరీరాన్ని చేరుతుంది కనుక, దానిలో ఉండే అధిక ఫ్లోరిన్ ను డీఫ్లోరిడేషన్ చేస్తారు. దీన్నే ఫ్లోరిన్ తొలగించడం అంటారు. ఎముకల ఫ్లోరోసిస్ ఈ సమస్య నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది.ఎముకలు గట్టిపడడం, ఎముకలలో నొప్పి, వెన్నుపూస వొంగిపోవడం లాంటి అసాధారణ మార్పులు రావడం, కాళ్ళు వంకరపోవడం లాంటివి జరుగుతాయి. కాళ్ళు వంకరపోవడం అనేది నీటిలో ఫ్లోరిన్ శాతం 2-16 మి.గ్రా. ఉన్నప్పుడు వస్తుంది. అంతేగాక మన ఆహారంలో మాలిబ్డినం అనే ఖనిజ లవణం ఎక్కువైనప్పుడు మరియు కాపర్ తక్కువైనప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. దంతాల ఫ్లోరోసిస్ నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ అవడం వల్ల దంతాలపై శాశ్వతంగా మచ్చలు ఏర్పడతాయి. ఎనామిల్ నునుపుతనం కోల్పోయి గరుకుగా మారుతుంది. దంతాలపై పసుపు పచ్చని చారలు క్రమంగా ఏర్పడి శాశ్వతంగా ఉండిపోతాయి.ఈ సమస్య పురుషులు, స్త్రీలలో సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఫ్లోరిన్ అధికంగా తీసుకోవడం వల్ల అయొడిన్ జీవక్రియ తగ్గి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల విటమిన్ లోపం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కాళ్ళు అసాధారణ రూపంలో మారుతాయి. ఫ్లోరిన్ లభించే పదార్థాలు ఫ్లోరిన్ ముఖ్యంగా తాగునీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. సున్నిత జలంలో ఫ్లోరిన్ ఉండదు. కటిన జలంలో దాదాపు 10 ppm వరకు ఫ్లోరిన్ ఉంటుంది. ఆహారపదార్థాలలో లభించే ఫ్లోరైడ్ కు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.సముద్రపు చేప ద్వారా 5-10 ppm లు, ఛాయ్ పత్తి నుండి 110-140 ppm లు లభిస్తుంది క్రోమియం మన శరీరంలో క్రోమియం సుమారు 6 మి.గ్రా.ల వరకు ఉంటుంది.క్రోమియం మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజ లవణం. మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.అంతేగాక పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల యొక్క జీవక్రియను ప్రభావితం చేస్తుంది.క్రోమియం జన్యు సమాసాన్ని పర్యవేక్షిస్తుంది. క్రోమియం మన శరీరంలో తక్కువ మోతాదులో ఉన్నట్లైతే ఇన్సులిన్ పనితీరు సక్రమంగా ఉండదు. శరీరంలో లిపిడ్స్ లో అసాధారణ మార్పులు కనిపిస్తాయి. క్రోమియం లభించే పదార్థాలు ఆల్చిప్పలు, కాలేయం,బంగాళదుంపలలో క్రోమియం అధికంగా ఉంటుంది.సముద్రపు ఆహార పదార్థాలలో క్రోమియం సమృద్ధిగా ఉంటుంది. తృణధాన్యాలు, కోడి మాంసంలో కూడా లభిస్తుంది.పాలు, పాల పదార్థాలు, పండ్లు,కూరగాయలలో క్రోమియం తక్కువగా ఉంటుంది. సిఫారసు చేయబడ్డ మోతాదు 6 నెలల నుండి 1 సం.ల వయస్సు గల పిల్లలకు 40 మైక్రో గ్రాములు, 1-5 సం.ల వయస్సు గల పిల్లలకు 80 మైక్రో గ్రాములు, కౌమారులకు 125 మైక్రో గ్రాములు, మధ్య వయస్సు వారికి 125 మైక్రో గ్రాములు క్రోమియం కావాలి. కోబాల్ట్ కోబాల్ట్ ఆహారంలో చాలా చిన్న మొత్తంలో అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం. ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మయలిన్ తొడుగు ఏర్పడ్డానికి సహాయపడుతుంది.ఇది విటమిన్ లో అంతర్భాగంగా ఉంటుంది. ఇది అంత సులభంగా జీర్ణవాహికతో శోషణ జరపదు. సాధారణంగా కోబాల్ట్ శరీరంలో 80-300 మైక్రో గ్రాముల స్థాయిలో ఉంటుంది. అలాగే ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం, క్లోమము, ఎర్రరక్తకణాలు మరియు ప్లాస్మా లో తయారవుతుంది. కోబాల్ట్ ఎర్రరక్తకణాల నిర్మాణానికి మరియు ఇతర కణాలకు సహాయపడుతుంది. ఉపయోగాలు కోబాల్ట్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఇది అలసట, జీర్ణ లోపాలు మరియు నాడీ కండరాల సమస్యలను కూడా నివారించడానికి కొన్ని సందర్భాలలో ఉపయోగకరంగా ఉంటుంది. రేడియోధార్మిక కోబాల్ట్ కొన్ని క్యాన్సర్ చికిత్స లకు ఉపయోగిస్తారు. కోబాల్ట్ ను సగటున రోజుకి 5-8 మి.గ్రా.లు తీసుకోవాలి. కోబాల్ట్ లోపం వల్ల కలిగే అనర్థాలు కోబాల్ట్ లోపం వల్ల అలసట,కాళ్ళు,చేతులు మరియు ఇతర అవయవాలలో బలహీనత,వికారం, బరువు తగ్గడం,తలనొప్పి, నీరసం లాంటివి వస్తాయి. దీర్ఘకాల కోబాల్ట్ లోపం వల్ల నరాల రుగ్మతలు, నరాలు దెబ్బతినడం, మతిమరుపు, సైకోసిస్ మరియు మరణం సంభవించవచ్చు. కోబాల్ట్ ఎక్కువ అవడం వల్ల గుండె సమస్యలు, గుండె ఆగిపోవడం జరుగుతుంది.ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.దీని వల్ల గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. సెలీనియం సెలీనియం అనేది నేలలో కనిపించే ఖనిజం. సెలీనియం సహజంగా నీరు మరియు కొన్ని ఆహారపదార్థాలలో కనిపిస్తుంది. సెలీనియం జీర్ణక్రియలో కీలక పాత్రను పోషిస్తుంది. సెలీనియం లభించే పదార్థాలు సెలీనియం ఎక్కువగా గొడ్డు మాంసం, పౌల్ట్రీ, ధాన్యాలు, సముద్రపు చేపలు, ఎరుపు స్నాపర్, హెర్నింగ్ వంటివి మాంస పదార్థాలలో, అక్రోట్లు, బ్రెజిల్ గింజలు వంటి పదార్థాల్లో ఉంటుంది. సెలీనియం లోపం వల్ల కలిగే వ్యాధులు సెలీనియం లోపం గుండె వ్యాధులు, హైపోథైరాయిడిజం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మదలైనవాటికి దారితీస్తుంది. పిల్లల్లో గుండె సమస్యలకు కారణమవుతుంది. సెలీనియం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చెడు శ్వాస, జ్వరం, వికారం మరియు కాలేయం, మూత్రపిండాలు, గుండె సమస్యలు సంభవిస్తాయి. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. సిఫారసు చేయబడ్డ మోతాదు వర్గం మి.గ్రా./రోజు పిల్లలు 1-3 సం. 20 4-8 సం. 30 9-13 సం. 40 పెద్దలు మరియు 14 సం.లు పైబడిన వారు 55 గర్భిణి స్త్రీలు 60 బాలింతలు 70 మాంగనీస్ మాంగనీస్ అనే ఖనిజ లవణం మన శరీరంలోని ఎముకలలో,మూత్రపిండాలలో, కాలేయంలో, ద్రవ్యాలలో ఉంటుంది.మానవ రక్తంలో మాంగనీస్ 2-3 మైక్రో/100 మి.లీ.గా ఉంటుంది. మన శరీరంలో మాంగనీస్ ఈ క్రింది అవసరాలకు ఉపయోగపడుతుంది. శరీర పెరుగుదలకు ఎముకల ఎదుగుదలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంపూర్ణంగా ఎదగడానికి. ఆహారంలో ఉన్న మాంగనీస్ కేవలం 3-4% వరకు మాత్రమే శోషించబడుతుంది. మిగిలింది మలం, మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. మాంగనీస్ లోపం వల్ల వచ్చే అనర్థాలు పెరుగుదల నశించడం ఎముకలలో అసాధారణ మార్పులు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనిచేయకపోవడం, పుట్టిన బిడ్డలలో అస్థిరతను చూస్తాము. అలాగే గనులలో పనిచేసే కార్మికులు మాంగనీస్ ని ఎక్కువగా పీల్చడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి: మాటలు తడబడడం, చేతులు ఎక్కువగా వణకడం. పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆధారం: కుమారి ఎ. ప్రశాంతి, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/047.