పచ్చికాయల్లో చక్కెరశాతం సమస్య లేదు. ఇందులో కెలొరీల కరిగించే పదార్థాలూ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గానూ, కూరల్లో నూ చేర్చి తీసుకోవచ్చు. ఎసిడిటీ వల్ల ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే సమస్య ఉండదు. గర్భిణులకు వాంతులూ, వికారం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి మధ్యాహ్నంవేళ భోజనం చేశాక కొందరికి బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడంవల్ల వూపిరితిత్తులు శుభ్రపడతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో వూపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను దూరం చేసే గుణం ఉంటుంది. చెమట కాయలు కూడా తొలగిపోతాయి. శరీరంలో వేడీ దూరమవుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటూ కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఈ కాలంలో చెమటపట్టడం వల్ల లవణాలను ఎక్కువగా కోల్పోతారు. పచ్చిమామిడి కాయ రసంలో కాస్త తేనె చేర్చి తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములూ నశిస్తాయి. దంతాలూ శుభ్రపడతాయి. పళ్ల మీద ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలూ దూరమవుతాయి. ఆధారము: ఈనాడు